ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవానినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిచేరు మన్మథుని మసి జేసినాడువాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడువాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు, వాడినేది కోరేది
ముక్కంటి, ముక్కోపి తిక్కశంకరుడు
ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
No comments:
Post a Comment