చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర
ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర ॥చీరలోని॥
మడికట్టుతో నువ్వు పూజచేస్తే
గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే
సిరిలకిని కురిపించును పంటలు
జారుకట్టుతో పడకటింట చేరితే
గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే
దండాలే పెడతారు అందరూ
అన్నం తిన్న తదుపరి
నీ మూతిని తుడిచేది
కన్నీరై ఉన్నప్పుడు
నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది ॥చీరలోని॥
పసిపాపలా నిదురపోయినప్పుడు
అమ్మ చీరేనే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు
ఈ చీరేగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడకా ఉక్కపోసినప్పుడు
ఆ పెటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు
ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది
భారతీయ సంస్కృతిని
సగర్వంగా చాటేది
మన జాతీయ జెండాకు
సమానంగా నిలిచేది ॥చీరలోని॥
No comments:
Post a Comment