ఎవరికోసం ఎవరికోసం
ఎంతకాలం ఎంతకాలం
ఈ జాజి తీగ రోజు రోజు
పూలు పూసేదెవరికోసం ఎంతకాలం
వాడి పోయిన నిన్నలన్ని మరచిపోయి
చిగురు లేసే ఒక్క రేపుని తలచి మురిసి
ఆ రేపు నేడై నేడు నిన్నై
రూపు మాసి పోవు వరకు
ఎదురు తెన్నులు చూచుకుంటూ
ఎరుపు కన్నులు సోలిపోతూ
ఎవరి కోసం ఎంతకాలం
కట్టుకున్న పందిరేమో కాలదన్నే
పుట్టి పెరిగిన పాదులో మమతెండిపోయే
ఇవ్వ గలిగినదివ్వలేక పొంద దలచినదేదీ పొందక
పొద్దు పొద్దు మొగ్గలేస్తూ తెల్లవారి రాలిపోతూ
ఎవరికోసం ఎంత కాలం
ముళ్ళ కంచెలు రాయి రప్పలు దాటినాను
మొండి బ్రతుకును ఒంటరిగనే మోసినాను
రాగమన్నది గుండెలో రాజుతున్నది ఎందుకో
రగిలి రగిలి నేను నేనుగ మిగిలి పోవుటకా
మిగిలియున్న రోజులైనా వెలుగు చూచుటకా
ఎవరి కోసం ఎంత కాలం
ఎవరి కోసం ఎంత కాలం
No comments:
Post a Comment